Friday, August 12, 2016

Babu Bangaram Movie Review | బాబు బంగారం రివ్యూసినిమా: బాబు బంగారం
తారాగణం: వెంకటేష్‌.. నయనతార.. సంపత్‌రాజ్‌.. మురళీశర్మ.. వెన్నెలకిషోర్‌.. పోసాని కృష్ణమురళి.. పృథ్వీరాజ్‌.. బ్రహ్మాజీ.. సోనమ్‌బజ్వా తదితరులు
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్రహణం: రిచర్డ్‌ప్రసాద్‌
కథ, మాటలు: ‘డార్లింగ్‌’ స్వామి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌
దర్శకత్వం: మారుతి.
సంస్థ: సితార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌.
విడుదల: 12-08-2016
వెంకటేష్‌ సినిమాలు అంటే వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పండించే అరుదైన కథానాయకుడాయన. ‘భలే భలే మగాడివోయ్‌’తో స్వచ్ఛమైన హాస్యంతో సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడిగానూ మారుతి గుర్తింపు తెచ్చుకొన్నారు. మరి.. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో ‘బాబు బంగారం’పై అంచనాలు పెరిగాయి. వీరి కాంబినేషన్లో రెట్టింపు వినోదాన్ని ఆశించారు ప్రేక్షకులు. మరి.. వారి ఆశలకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే..?: జాలి హృదయమున్న పోలీసు అధికారి కృష్ణ (వెంకటేష్‌). నేరస్తులను కూడా ఇబ్బంది పెట్టడం ఎరగడు. వాళ్లకి జలుబు చేసి తుమ్మినా సరే తెగ బాధ పడిపోతుంటాడు. ఇలాంటి కృష్ణకు సున్నితమైన ఐటీ అధికారి శాస్త్రి కేసును అప్ప చెబుతారు ఉన్నతాధికారులు. అలా పరిచయమైన శాస్త్రి కూతురు శైలజ (నయనతార)కు దగ్గరై ఆమె ప్రేమలో పడతాడు.
తనను తాను ఎన్‌ఆర్‌ఐగా పరిచయం చేసుకున్న కృష్ణ ఓ పోలీసు అధికారి అని శైలజకు తెలుస్తుంది. కేసు విచారణలో భాగంగానే దగ్గరయ్యాడని భావించి కృష్ణకు దూరమవుతుంది. తన జాలి హృదయంతో నేరస్తులు తప్పించుకొంటున్నారని.. తన ప్రేయసి కూడా దూరమైందని తెలుసుకొన్న కృష్ణ కరకుగా మారతాడు. మారిన కృష్ణ.. శాస్త్రి కేసును ఏం చేశాడు? తాను ప్రేమించిన శైలజకు ఎలా దగ్గరయ్యాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే?: మర్డర్‌ మిస్టరీ చుట్టూ సాగే కథ. దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్‌’లో కథానాయకుడి పాత్రకి మతిమరుపు అనే జబ్బుని ఎలా వాడాడో.. ఇందులో కథానాయకుడి పాత్రకి జాలి హృదయాన్ని ఆపాదించి వినోదం పండించే ప్రయత్నం చేశాడు. కానీ ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు సరికదా! ఆ మర్డర్‌ మిస్టరీ కూడా ఉత్సుకత రేకెత్తించటంలో తప్పటడుగులు పడ్డాయి. అక్కడక్కడా కాసిన్ని నవ్వులు.. సెకండ్‌హాఫ్‌లో కొన్ని సీన్లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. తొలి సగం వెంకటేష్‌.. వెన్నెల కిషోర్‌.. గిరి బ్యాచ్‌తో పాటు.. శైలజ బావ బత్తాయి బాబ్జీ (పృథ్వీ) పాత్రల చుట్టూ సరదా సన్నివేశాలతో సాగుతుంది. పృథ్వీ ‘నాన్నకు ప్రేమతో’ స్పూఫ్‌లో కనిపించి కాసేపు సందడి చేస్తారు. మలి సగంలో హిప్నాటిజం చేసే మెజీషియన్‌గా బ్రహ్మానందం కాసేపు నవ్వులు పండిస్తారు. కథని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకూ.. వినోదాన్ని పండించేందుకూ ఆస్కారమున్నా దర్శకుడు ఆ విషయంలో తడబడినట్లుగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: వెంకటేష్‌.. నయనతార జోడీ తెరపై బాగుంటుందన్న విషయం ఈ చిత్రంతో మరోసారి రుజువవుతుంది. వెంకటేష్‌ తనదైన స్టైల్‌లో కామెడీ చేసే ప్రయత్నం చేశారు. నయనతారకి పెద్దగా నటించడానికి ఆస్కారమేమీ లేదు. అయితే పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. కామెడీ విషయంలో పృథ్వీ.. బ్రహ్మానందం.. పోసాని పాత్రలు ఆకట్టుకొంటాయి. వెన్నెలకిషోర్‌ అండ్‌ గ్యాంగ్‌కి పెద్దగా నవ్వించే ఆస్కారం లభించలేదు. చమ్మక్‌ చంద్ర మొదలుకొని పలువురు జబర్దస్త్‌ నటులు తెరపై కనిపిస్తారు కానీ వాళ్ల పాత్రలు ఇలా వచ్చి అలా మాయమవుతాయి.
సాంకేతికంగా సినిమాలో అన్ని హంగులూ కనిపిస్తాయి. జిబ్రాన్‌ సమకూర్చిన బాణీలు.. జెబీతో కలిసి చేసిన నేపథ్య సంగీతం.. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా పనితనం బాగా కుదిరింది. నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.
బలాలు
+ వెంకటేష్‌.. నయనతార
+ పృథ్వీ.. పోసాని.. బ్రహ్మానందంల కామెడీ
బలహీనతలు
- కథనం
- పతాక సన్నివేశాలు
చివరిగా.. కొద్దిగా నవ్వులు.. మరి కొద్దిగా కాలక్షేపాన్నిచ్చే ‘బాబు బంగారం’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.